ఈ పుస్తకం మొదట పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన శ్రీ మల్లాది గోవింద దీక్షితుల ఇంట్లో తర తరాలుగా వారి పూజామందిరంలోనే ఉండేది.దాన్ని ప్రజల కోసం బహిరంగపరచవలసిందని ఇటీవల వచ్చిన దైవాదేశం మేరకు శ్రీ గోవింద దీక్షితులు ఆ పాత తాళపత్రాల ప్రతికి ఆధునిక కాయితాలపై శుద్ధప్రతి సిద్ధం చేసి పాత ప్రతిని విజయవాడ దగ్గర కృష్ణానదిలో నిమజ్జనం చేశారు.తరువాత కాయితాల ప్రతిని తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం పట్టణంలో ఉన్న శ్రీపాద శ్రీవల్లభ సంస్థానంవారికి సమర్పించారు.సంస్థానంవారు క్రితం సంవత్సరం దాని ప్రచురణ బాధ్యత మొదటిసారిగా వహించారు.
ఇది తొట్టతొలుత క్రీ.శ.1350 ప్రాంతంలో సంస్కృతంలో రచించబడిందని పుస్తకం లోపల కనిపిస్తున్న వివరాల్ని బట్టి తెలుస్తోంది.మూలగ్రంథకర్త శంకరభట్టు అనే కన్నడ బ్రాహ్మణుడు.అతను శ్రీపాద శ్రీవల్లభ స్వామివారికి సమకాలికుడు.పరమ భక్తుడు.శ్రీ స్వామి వారు స్వయంగా ఆదేశించిన మీదట అతను ఆయన చరిత్రని సంస్కృతంలో కూర్చి స్వామివారి తల్లివైపు వంశమైన మల్లాదివారికి అప్పగించాడు.అది మల్లాదివారి దగ్గర కొన్ని దశాబ్దాల పాటు ఉన్న రోజుల్లో ఎవరో దాన్ని తెలుగులోకి అనువదించారు.ఆ అనువాదకుల పేరు పుస్తకంలో లభ్యం కావడం లేదు.అనంతరం సంస్కృత ప్రతిని గంధర్వులు తమ లోకానికి తీసుకువెళ్ళారు.తెలుగు ప్రతి మాత్రమే భూలోకంలో (మల్లాదివారి దగ్గర)మిగిలింది.కాబట్టి ఇప్పుడు స్వామివారి గురించి విపులంగా తెలుసుకోవడానికి ఈ తెలుగుప్రతి తప్ప వేరే ఆధారం లేదు.(ఇది కూడా చిన్నదేమీ కాదు.A4 సైజులో సుమారు 340 పుటలుగా అచ్చయిన మహా గ్రంథం) తరువాతి కాలంలో ఆ సంస్కృత ప్రతి గంధర్వుల నుంచి కొందరు ఋషీశ్వరుల దగ్గరికి చేరింది.ఇప్పుడు పిఠాపురంలో స్వామివారి పాదుకలు ప్రతిష్ఠించిన చోట అనేక నిలువుల లోతున అది ఆ ఋషీశ్వరుల చేత ఇప్పటికీ నిత్యమూ పారాయణ చెయ్యబడుతోంది.
షిర్డీ సాయిబాబా భక్తి ప్రాచుర్యం పొందిన ఆంధ్రదేశంలో ఆయన పూర్వజన్మ (పూర్వావతారం) అయిన శ్రీపాద శ్రీవల్లభుల జీవిత చరిత్ర తొలిసారిగా బయటపడడంతో సాయిభక్తులు ఆనంద పారవశ్యంలో మునిగి తేలుతున్నారు.సాక్షాత్తు సృష్టికర్త అయిన శ్రీపాద శ్రీవల్లభుల జన్మస్థానం ఆంధ్రదేశమే (పిఠాపురం) కావడం, తద్వారా ఆయన తెలుగువాడుగా జన్మించి ఉండడం మొదలైన కారణాల వల్ల తెలుగుజాతికి స్వామివారు ఏదో విశేషానుగ్రహాన్ని ఇవ్వనుద్దేశించి ఈ పుస్తకాన్ని బహిర్గతం చేశారనే అభిప్రాయం సర్వత్ర వ్యక్తమౌతోంది.
ఇది కేవలం పరిచయం మాత్రమే.నా రాబోయే టపాల్లో ఈ పుస్తకంలోని ఆసక్తికర విషయాల గురించి వివిధ శీర్షికల క్రింద సావకాశంగా రాస్తాను.
3 వ్యాఖ్యలు ;:
మా అమ్మగారు షిరిడీ సాయి బాబా గారిని బాగా అరాధిస్తారు....
కావున వారు ఈ పుస్తకం చదివితే సంతోషిస్తారు...
ఇది ఎక్కడ లభ్యమవుతుందో తెలుపగలరు...
miiru vivarimcea aa vishayala koasam aasakti gaa edurucuustunnamamdi.
తాళపత్ర గ్రంధాన్ని కృష్ణలో నిమజ్జనం చేసారని చదివి నిర్ఘాంతపోయాను. గ్రంధ విషయాన్ని కాగితాల్లో భద్రపరచి ఉండవచ్చు గానీ, దాని పురాతత్వ విలువను నీట గలిపినట్లైంది.
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి
గమనిక :- ఇది సనాతన, సాంప్రదాయిక, ఆస్తిక, దేశభక్తియుత బ్లాగు.
రచయిత తన టపాలలో వ్యక్తం చేసిన అభిప్రాయాలతో విభేదించి పొఱపాట్లు ఎత్తిచూపే హక్కు చదువరులందఱికీ ఉంది. కాని ఈ బ్లాగు యొక్క (పైన పేర్కొన్న) స్ఫూర్తికీ, లక్ష్యాలకూ విరుద్ధంగా మూలచ్ఛేదంగా వ్యాఖ్యలు చేస్తే మాత్రం అవి తక్షణమే తొలగించబడతాయి. అందుకు ఆ వ్యాఖ్యాతలే బాధ్యులు. ఎవరినీ వ్యక్తిగతంగా నొప్పించకుండా, కించపఱచకుండా వ్యాఖ్యలు వ్రాయండి.