లో 99శాతం పద్యాలు కవి స్వోపజ్ఞకాలే గాని ఏ ఇతరభాషాగ్రంథానికీ అనువాదం కాకపోవడం విశేషం. కవి అనుకరించాలనుకుంటే, కామందక నీతిసారం నుంచో, క్షేమేంద్రుడి చారుచర్య నుంచో అనువదించి ఉండగలడు. కాని అలా చెయ్యలేదు. కారణం- దీన్ని ఒక గ్రంథంగా సంతరించాలనే ఉద్దేశంతో కవి ఈ పద్యాల్ని కూర్చినట్లు కనిపించదు. అప్పుడొకటీ, ఇప్పుడొకటీ ఆశువుగా చెప్పినవే తరువాత శతకరూపం దాల్చి ఉంటాయి. అలా అనుకున్నప్పుడు, బహుశా మొదట్లో ఈ గ్రంథంలో వందపద్యాలకంటే ఎక్కువే ఉండి ఉండాలి.ఇది బడిపిల్లలకి పాఠ్యపుస్తకంగా మారాక పిల్లల సౌలభ్యం కోసం కుదించిన వంద పద్యాలే చివరికి పెద్దలక్కూడా మిగిలాయి కాబోలు. గ్రంథంగా సంతరించాలనే ఉద్దేశం లేకపోవడం చేత భర్తృహరి నీతిశతకం (సంస్కృతం) లానో, తిరువళ్ళువర్ రచంచిన తిరుక్కుఱళ్ (అరవం)లానో ఈ శతకానికి విషయ విభజన చెయ్యడం అసాధ్యమైంది. ఒకే పద్యంలో పరస్పర సంబంధం లేని అనేక విషయాలకి ఓ సామాన్యక్రియ (common verb) తోనో, ఓ సామాన్య విశేషణం (common adjective) తోనో లంకెపెట్టడం సుమతీశతకమంతటా కవి అవలంబించిన ప్రక్రియ.పద్యమంతటా ఒకే అంశాన్ని స్పృశించిన సందర్భాలున్నాయి గాని తక్కువ. ఈ క్రింద కొన్ని ఉదాహరణలిస్తున్నాను, పరికించండి :
క. అక్కఱకు రాని చుట్టము, మ్రొక్కిన వరమీని వేల్పు, మోహరమున దా
నెక్కిన బారని గుఱ్ఱము గ్రక్కున విడువంగవలయు గదరా సుమతీ !
క. అడియాస కొలువు గొలువకు, గుడిమణియము సేయబోకు, కుజనుల తోడన్
విడువక కూరిమి సేయకు, అడవిని తోడరయకొంటి నరుగకు సుమతీ !
క. అప్పుగొని చేయు విభవము, ముప్పున బ్రాయంపుటాలు మూర్ఖుని తపమున్
తప్పరయని నృపు రాజ్యము దెప్పరమై మీద గీడు దెచ్చుర సుమతీ !
క. ఆకొన్న కూడె అమృతము : తా కొంకక యిచ్చువాడె దాత ధరిత్రిన్
సోకోర్చువాడే మనుజుడు : తేకువ గలవాడె వంశతిలకుడు సుమతీ !
క. ఇచ్చునదె విద్య : రణమున జొచ్చునదే మగతనంబు : సుకవీశ్వరులున్
మెచ్చునదె నేర్పు : వాదుకు వచ్చునదే కీడు సుమ్ము వసుధను సుమతీ !
మకుటానికి (అంటే- సుమతీ అనే పద్యాంతానికి) ముందు యతినిర్బంధవశాన ఉంచిన "వసుధను కదరా మహిలో "మొదలైన మాటలు మినహా సుమతీశతకంలో తురుపుముక్కల్లాంటి వ్యర్థపదాలెక్కడా కనిపించవు. పదాల కోసం తడుముకోవడం కూడా లేదు.ఈ ధారాశుద్ధిని బట్టే ఈ రచన మొదట్లో పూర్తిగా మౌఖికమైన ఆశుకవిత్వమై ఉండవచ్చుననడం.
0 వ్యాఖ్యలు ;:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి
గమనిక :- ఇది సనాతన, సాంప్రదాయిక, ఆస్తిక, దేశభక్తియుత బ్లాగు.
రచయిత తన టపాలలో వ్యక్తం చేసిన అభిప్రాయాలతో విభేదించి పొఱపాట్లు ఎత్తిచూపే హక్కు చదువరులందఱికీ ఉంది. కాని ఈ బ్లాగు యొక్క (పైన పేర్కొన్న) స్ఫూర్తికీ, లక్ష్యాలకూ విరుద్ధంగా మూలచ్ఛేదంగా వ్యాఖ్యలు చేస్తే మాత్రం అవి తక్షణమే తొలగించబడతాయి. అందుకు ఆ వ్యాఖ్యాతలే బాధ్యులు. ఎవరినీ వ్యక్తిగతంగా నొప్పించకుండా, కించపఱచకుండా వ్యాఖ్యలు వ్రాయండి.