నిజానికి వెలయాండ్ర పట్లనే కాదు, అసలు స్త్రీజాతి మీదనే 'సుమతి ' బాబాయికి అపనమ్మకం. కవి అనేక మంది స్త్రీలని ప్రేమించి విఫలమైన భగ్నస్వాంతుడేమో అనిపిస్తుంది-ఈ క్రింది పద్యాలు చదివినప్పుడు !
క. అల్లుని మంచితనంబును గొల్లని సాహిత్యవిద్య కోమలి నిజమున్
పొల్లున దంచిన బియ్యము, తెల్లని కాకులును లేవు తెలియర సుమతీ !
క. కడు బలవంతుండైనను, పుడమిని ప్రాయంపుటాలి పుట్టిన యింటన్
తడవుండనిచ్చెనేనియు, పడుపుగ అంగడికి తానె పంపుట సుమతీ !
(ప్రాయంపుటాలు = వయసులో ఉన్న భార్య)
క. కాదు సుమీ దుస్సంగతి, పోదు సుమీ కీర్తికాంత పొందిన పిదపన్
వాదు సుమీ అప్పిచ్చుట, లేదు సుమీ సతుల వలపు లేశము సుమతీ ! (లేశము = కొంచెమైనా)
క. గడన గల మగని చూచిన అడుగులకు మడుగులిడుదు రతివలు తమలో
గడనుడుగు మగని చూచిన నడపీనుగు వచ్చెనంచు నగుదురు సుమతీ !
(గడన = ధనసంపాదన ; అతివలు = స్త్రీలు)
క. చింతింపకు గడచిన పనికి, ఇంతులు వలతురని నమ్మకెంతయు మదిలో
అంతఃపుర కాంతలతో మంతనములు మానుమిదియె మతముర సుమతీ !
(ఇంతులు వలతురని = స్త్రీలు ప్రేమిస్తారని)
క. పగ వలదెవ్వరితోడను, వగవంగా వలదు లేమి వచ్చిన పిదపన్
తెగనాడవలదు సభలను, మగువకు మనసీయవలదు మహిలో సుమతీ !
వలదు = వద్దు ; వగవంగావలదు = బాధపడవద్దు ; లేమి = పేదరికము ; సభలను = సభలలో ; తెగనాడవలదు = నిందించవద్దు ; మగువకు = స్త్రీకి)
ఇలా కవి ప్రదర్శించిన నిరసన భావాలు మధ్యయుగాలనాటి పురుషుల మానసికస్థితికి ప్రతిబింబమే.తాము స్త్రీవ్యామోహంలో స్వయంగా ఇరుక్కుని మోహయంత్రం, పతనమార్గం అంటూ స్త్రీని నిందించేవారు. సుమతీశతక కర్త మరీ అంతదూరం పోలేదు.ఐనా ఆయన మరీ ఎక్కువ స్త్రీద్వేషి కాడు.ఇల్లాళ్ళ పట్ల ప్రేమగా, సవ్యంగా వ్యవహరించాలనేదే ఆయన అభిప్రాయం.అగ్నిసాక్షిగా వివాహమాడిన భార్యతోడి ధర్మశృంగారాన్నే ఆయన ప్రోత్సహించాడు.
క. కులకాంత తోడ నెప్పుడు కలహింపకు ; వట్టి తప్పు ఘటియింపకుమీ !
కలకంఠి కంట కన్నీరొలికిన సిరి యింట నుండ నొల్లదు సుమతీ !
(కులకాంత = ఇల్లాలు ; వట్టి తప్పు = అకారణ దోషారోపణ ; ఒల్లదు = ఒప్పుకోదు)
క. పతి కడకు, తనకు కూర్చిన సతి కడకు, వేల్పు కడకు, సద్గురు కడకున్
సుతు కడకు రిత్తచేతుల మతిమంతులు చనరు నీతిమార్గము సుమతీ !
(పతి = రాజు ; కూర్చిన సతి = ఇష్టమైన భార్య ; వేల్పు = దేవుడు ; సుతు కడకు = కొడుకు దగ్గరకు ; రిత్తచేతుల = వట్టిచేతులతో ; చనరు = వెళ్ళరు)
1 వ్యాఖ్యలు ;:
సుమతీ శతకకారుడు బద్దెన కదండీ. ఈ స్త్రీద్వేషపూరిత పద్యాలు నిజంగా అయనవేనా లేక మరెవరైనా ఆ శైలిలో రాసి కలిపేసుంటారా? (వేల కొద్దీ వేమన పద్యాలు కొత్తగా పుడుతున్నట్లుగా)
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి
గమనిక :- ఇది సనాతన, సాంప్రదాయిక, ఆస్తిక, దేశభక్తియుత బ్లాగు.
రచయిత తన టపాలలో వ్యక్తం చేసిన అభిప్రాయాలతో విభేదించి పొఱపాట్లు ఎత్తిచూపే హక్కు చదువరులందఱికీ ఉంది. కాని ఈ బ్లాగు యొక్క (పైన పేర్కొన్న) స్ఫూర్తికీ, లక్ష్యాలకూ విరుద్ధంగా మూలచ్ఛేదంగా వ్యాఖ్యలు చేస్తే మాత్రం అవి తక్షణమే తొలగించబడతాయి. అందుకు ఆ వ్యాఖ్యాతలే బాధ్యులు. ఎవరినీ వ్యక్తిగతంగా నొప్పించకుండా, కించపఱచకుండా వ్యాఖ్యలు వ్రాయండి.