26 August 2006

సుమతీశతక స్ఫూర్తి-5

సుమతీశతకం నీతిశాస్త్రమా ?

బడిపిల్లల చేత కంఠతా పట్టించేవి కనుక సుమతీశతక పద్యాలు నీతి సంబంధ రచనలనే అభిప్రాయం సర్వేసర్వత్ర వ్యాపించిపోయింది. వాస్తవానికీ, ప్రచారానికీ నడుమ ఇలా మహాసముద్రాలూ, పర్వతాలూ ఎందుకేర్పడతాయో అర్థం కాదు. సుమతీశతక కర్త నిజానికి ఛాందస నీతివాది కాడు. పైపెచ్చు, అందుకు పూర్తి విరుద్ధంగా ఆయన ఒక పచ్చి వాస్తవికవాది అని చెప్పుకోవాల్సి వస్తుంది.ఈనాడు మనకి సుమతీశతకం పేరుతో లభించే 108పద్యాల్లో నీతిబోధకాలైనవాటి సంఖ్య అంతా కలిపి 25 కి మించదు. ఇందుకొక్కటే పరీక్ష. "అలా చెయ్యి, ఇలా చెయ్యొద్దు" అని శతకకర్త చెప్పిన పద్యాలెన్ని ఉన్నాయో లెక్కించాలి. మిగతా 83 పద్యాల్లోను కవి తన సమకాలీన సమాజం పై తన అభిప్రాయాల్నీ, తన తాత్విక దృక్కోణాన్నీ వెల్లడించాడు. కవి ఈ రచనని నీతిగ్రంథంగా ఉద్దేశించలేదనడానికి మరో ఆధారం-ఆయన ఎక్కడా దైవభక్తిని గాని, శాస్త్ర విధేయతని గాని, మతాభిమానాన్ని గాని ప్రస్తావించిన సందర్భం లేకపోవడం. కారణం- సాధారణంగా ప్రాచీన మానవుల నీతిలో పైన పేర్కొన్నవన్నీ విడదీయరాని అంతర్భాగాలుగా ఉంటాయి. ఐతే, ఇప్పుడు లభ్యమౌతున్న ముద్రిత శతక ప్రతుల్లో మొదట-

క. శ్రీరాముని దయ చేతను, ఆరూఢిగ సకల జనులు 'ఔరా' అనగా
ధారాళమైన నీతులు, నోరారగ చవులు పుట్ట నుడివెద సుమతీ !

అనే ఒక అవతారికా ప్రాయమైన కృత్యాది పద్యం గోచరిస్తోంది. ఇది శతక కర్త రాసిందేనా ? అని నా సందేహం. సుమతీశతకంగా లభించే పద్యాలన్నీ అకారాది (alphabetical order)లో సంకలనం చేశాక, కృత్యాది సాంప్రదాయికంగా 'శ్రీ' కారంతో మొదలవ్వాలని ఎవరో పైపద్యాన్ని రచించి ప్రక్షేపణ (interpolation) చేశారనుకుంటా. గతానుగతికంగా కృత్యాది చేసిన కవి ఆశ్వాసాంతమూ, ఫలశ్రుతీ కూడా ఎందుకు చెయ్యలేదు ?సుమతీశతక పద్యాలు బడిపిల్లల చదువుల్లో విడదీయరాని అంతర్భాగమైపోయి, అది ఒక నీతిశతకమనే అపోహ విస్తారంగా ప్రబలిపోయాక జరిగిన పని ఇది.

సుమతీశతకమే కాదు, వేమన శతకం కూడా నిజానికి నీతిశతకం కాదు. 'నీతి ' అంటే మనకీనాడు స్ఫురించే ఆదర్శ భావజాలాన్ని ఈ శతకకర్తలు ఎప్పుడూ బోధించలేదు. సంస్కృత భర్తృహరిలో మనకి కనిపించే అవాస్తవిక నీతిచిత్రణకి ఈ తెలుగు కవులెప్పుడూ పాల్పడలేదు. తెలుగులో కుమార శతకం, కుమారీశతకం తప్ప నీతిశతకాలేవీ లేవని నా అభిప్రాయం. ఆ రెండూ కూడా East India Company వారి పాలనలో అవతరించాయి.

సుమతీశతక కర్త తెలుగుదేశపు కన్ఫూషియస్ (Confucius) అని చెప్పుకోవచ్చు.ఆయన యొక్క పండబారిన జీవితానుభవమంతా ఆ శతకంలో దర్శనమిస్తుంది. ఆయన యొక్క పదునైన, లోతైన సామాజిక స్పృహ మనల్ని చకితుల్ని చేస్తుంది.ఆయనలో కల్పనాచాతుర్యం లేదు.అందుకనే తన భావాల్ని సూటిగా వెల్లడించడానికి ప్రయత్నించాడే తప్ప ఒక కథ రాసి అందులోని పాత్రల ద్వారానో, సంఘటనల ద్వారానో సందేశమివ్వడానికి చూడలేదు.

1 వ్యాఖ్యలు ;:

lalitha చెప్పారు...

Balasubrahmanyam gaaru,

I have a difference of opinion with you on a lot of topics. However, when I was going through your posts about SumatI Satakam, I found expression for a lot of my own observations particularly in the context of teaching the "Satakams" to young kids.

Please visit my website. I explained a couple of poems from Vemana and SumatI Satakam for the benefit of my kids and other similarly interested parents. I am on the job of explaining some more.

It has not been an easy job to first pick out those that are particularly suitable for young kids and, next, to put what seems to come out so easily in these padyams, in my words.

Regards,
lalitha.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

గమనిక :- ఇది సనాతన, సాంప్రదాయిక, ఆస్తిక, దేశభక్తియుత బ్లాగు.

రచయిత తన టపాలలో వ్యక్తం చేసిన అభిప్రాయాలతో విభేదించి పొఱపాట్లు ఎత్తిచూపే హక్కు చదువరులందఱికీ ఉంది. కాని ఈ బ్లాగు యొక్క (పైన పేర్కొన్న) స్ఫూర్తికీ, లక్ష్యాలకూ విరుద్ధంగా మూలచ్ఛేదంగా వ్యాఖ్యలు చేస్తే మాత్రం అవి తక్షణమే తొలగించబడతాయి. అందుకు ఆ వ్యాఖ్యాతలే బాధ్యులు. ఎవరినీ వ్యక్తిగతంగా నొప్పించకుండా, కించపఱచకుండా వ్యాఖ్యలు వ్రాయండి.