26 August 2006

సుమతీశతక స్ఫూర్తి-4

పాఠాంతరాలు

సుమతీశతకానికి సంబంధించి కొన్ని పద్యాల దగ్గర వివాదం ఉంది. ఉదాహరణకి గొల్లపూడి వీరాస్వామి అండ్ సన్స్ (రాజమహేంద్రవరం) వారు ప్రచురించిన ప్రతిలోని ఈ పద్యాలు బాలసరస్వతీ బుక్ డిపో (మద్రాసు) వారి ప్రతిలో లేవు.

క. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడె పుట్టదు ; జనులా
పుత్రుని కనుగొని పొగడగ పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ ! 1

క. మది నొకని తలచి ఉండగ మది చెడి యొక క్రూర విటుడు మానక తిరుగన్
అది చిలుక పిల్లి పట్టిన చదువునె యా పంజరమున జగతిని సుమతీ !2

క. మేలెంచని మాలిన్యుని మాలను అగసాలివాని మంగలి హితుగా
ఏలిన నరపతి రాజ్యము నేల గలిసిపోవు గాని నెగడదు సుమతీ ! 3

క. వెలయాలు చేయు బాసలు, వెలయగ నగసాలి పొందు, వెలమల చెలిమిన్,
కలలోన కన్న కలిమిని విలసితముగ నమ్మరాదు వినరా సుమతీ ! 4

క. వేసరపు జాతి గానీ, వీసము దా జేయునట్టి వెంగలి గానీ
దాసికొడుకైన గానీ, కాసులు గలవాడె రాజు గదరా సుమతీ ! 5

క. సరసము విరసము కొఱకే.... (పూర్తిపాఠానికై చూ.సుమతీశతక స్ఫూర్తి-10 పోస్టు) 6

క. సిరి తా వచ్చిన....(పూర్తిపాఠానికై చూ.సుమతీశతక స్ఫూర్తి-10 పోస్టు) 7

క. స్త్రీల యెడ వాదులాడకు, బాలురతో చెలిమి చేసి భాషింపకుమీ !
మేలెన్ను గుణము విడువకు, మేదినిపతి నింద సేయకెన్నడు సుమతీ ! 8

కవి అసలు పై పద్యాలు రాసి ఉండడని ప్రకాశకులు భావించడానికి కొన్ని కారణాలు ఉండవచ్చు. "పుత్రోత్సాహము...." అనే పద్యం సుమతీశతకంలోనిదిగా ప్రసిద్ధం. దాన్నెందుకు పరిత్యజించారో తెలీదు. అలాగే ఐదో పద్యాన్నీ, ఆరో పద్యాన్నీ కూడా ఎందుకు పరిత్యజించారో తెలీదు. 4 వ పద్యంలో కులదూషణ ఉంది కాబట్టి ప్రచురించడానికి సంకోచించి ఉంటారు.ఏడో పద్యంలోను,ఎనిమిదో పద్యంలోను ప్రాసభంగం ఉంది గనుక అవి అసలుకవివి కావని భావించి ఉంటారు.

నిజానికి ఈ కారణాలు వేటివల్ల గాని పై పద్యాల్ని తొలగించనక్కర్లేదు. ముఖ్యంగా కులదూషణలా కనిపించే ప్రాచీన రచనలు నిజంగా అందుకోసం ఉద్దేశించినవి కావు.మనం నమ్మే సర్వమానవ సమానత్వంలోను, స్వేచ్ఛలోను మన పూర్వీకులకి నమ్మకం లేదు. వారి దృష్టిలో ప్రపంచం ఓ అసమానత్వాల పుట్ట. అందుకని ఓ కులం ఎక్కువ, ఓ కులం తక్కువ అనే భావనలు పెట్టుకోవడం వారి మటుకు వారికి తప్పు కాదు. కాబట్టి అలాంటి భావాల్ని ప్రతిబింబించే రచనలు వర్తమానానికి అప్రస్తుతమైనా కనీసం చారిత్రిక పురావస్తువులు (relics)గా పనికొచ్చే సాహిత్యంతో పాటు భద్రపరచుకోక తప్పదు. ఇందులో మనం వైయక్తిక రాగ ద్వేషాలకి లోనుకానక్కర్లేదు.

ఇహపోతే, ఛందోభంగాలు. ఇవి లాక్షణిక నిర్దుష్టత దృష్ట్యా స్ఖాలిత్యాలు (deviations) అవుతాయేమో గాని, మౌఖిక సాహిత్య (oral tradition)లక్షణాల దృష్ట్యా మాత్రం చాలా సహజం. కవి వీటిని కృత్రిమంగా సుదీర్ఘాలోచన చేసి కల్పించలేదనీ, అప్పటికప్పుడు ఆశువుగా చెప్పి ఉంటాడనీ జాడపట్టి ఇచ్చేవే ఈ ఛందోభంగాలు.

గత 600 సంవత్సరాలుగా మౌఖిక ప్రచారం (oral publicity)లో ఉండడం మూలాన సుమతీశతక పద్యాల్లో మొదట ఉన్నవి కొన్ని కాలగర్భంలో కలిసిపోయి ఉండొచ్చు. లేనివి అనంతర కాలంలో 'ఆశు కవుల పుణ్యమా' అని కొత్తగా చేరీ ఉండొచ్చు. అందుచేత ఈ శతక పరిశుద్ధత విషయంలో ఇంక మనకి మిగిలిన ఒకే ఒక ఆధారం- వీథిబళ్ళలో చిన్నపిల్లల చేత అనూచానంగా బట్టీపట్టిస్తూ వస్తున్న పద్యాలు. అలాంటివి అన్నీ కలిపి పాతికా, ముప్ఫై మించవు.

0 వ్యాఖ్యలు ;:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

గమనిక :- ఇది సనాతన, సాంప్రదాయిక, ఆస్తిక, దేశభక్తియుత బ్లాగు.

రచయిత తన టపాలలో వ్యక్తం చేసిన అభిప్రాయాలతో విభేదించి పొఱపాట్లు ఎత్తిచూపే హక్కు చదువరులందఱికీ ఉంది. కాని ఈ బ్లాగు యొక్క (పైన పేర్కొన్న) స్ఫూర్తికీ, లక్ష్యాలకూ విరుద్ధంగా మూలచ్ఛేదంగా వ్యాఖ్యలు చేస్తే మాత్రం అవి తక్షణమే తొలగించబడతాయి. అందుకు ఆ వ్యాఖ్యాతలే బాధ్యులు. ఎవరినీ వ్యక్తిగతంగా నొప్పించకుండా, కించపఱచకుండా వ్యాఖ్యలు వ్రాయండి.